సర్కారు సన్న బియ్యం ఎఫెక్ట్..దిగొస్తున్న సన్న బియ్యం రేట్లు..

సర్కారు సన్న బియ్యం ఎఫెక్ట్..దిగొస్తున్న సన్న బియ్యం రేట్లు..
  • క్వింటాల్​కు రూ.400 నుంచి రూ.600 వరకు తగ్గిన రేటు 
  • ఇప్పటికే జిల్లాల్లో 80 శాతం సన్నబియ్యం పంపిణీ

నల్గొండ, వెలుగు : సన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో మార్కెట్లో బియ్యం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల వరకు ఫైన్ క్వాలిటీ రైస్ ధరలు క్వింటాల్ రూ.6,500 నుంచి రూ.5,800 వరకు పలికాయి. ఇప్పుడు క్వింటాల్ కు రూ.5 వేల లోపే ధర పలుకుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్న రకం వరి సాగును ప్రోత్సహించింది. సన్న వడ్లకు క్వింటాల్​కు రూ.500 బోనస్ ప్రకటించింది. దీంతో అటు ప్రభుత్వం, ఇటు మిల్లర్లు పోటీపడి సన్న వడ్లు కొనుగోలు చేశారు. సప్లై పెరగడంతో వ్యాపారులు సన్న బియ్యం ధరలు తగ్గించారు.  

తగ్గుముఖం పడుతున్న ధరలు..

గత బీఆర్​ఎస్​పాలనలో రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో వాటిని తినలేక పేదలు మార్కెట్ లో అమ్ముకొని సన్న బియ్యం కొనుగోలు చేసేవారు. దీంతో సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. గత ఉగాది పర్వదినం నాడు కాంగ్రెస్​ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. మరోవైపు పంపిణీ చేసిన సన్న బియ్యం సైతం నాణ్యతా ఉండడంతో ఎన్నడూలేని విధంగా లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకునేందుకు రేషన్ షాపులకు ఎగబడ్డారు. ఇప్పటికే జిల్లాల్లో దాదాపు 80 శాతం వరకు పంపిణీ పూర్తయింది. 

ఉమ్మడి జిల్లాలో 29,28,549 మంది లబ్ధిదారులు..

రేషన్ కార్డు ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం సరఫరా చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 29,28,549 మంది లబ్ధిదారులు ఉండగా, ప్రతినెలా 17,869 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనుంది. గతంలో దొడ్డు రకం బియ్యం పంపిణీ చేయడంతో వాటిని లబ్ధిదారులు రేషన్ డీలర్లకే అమ్ముకోవడంతో పెద్ద ఎత్తున రీ సైకిలింగ్ జరిగేవి. ప్రస్తుతం సన్న బియ్యం లబ్ధిదారులే వినియోగిస్తుండడంతో మార్కెట్ లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. 

తగ్గిన సన్న రకం బియ్యం..

ప్రస్తుతం సన్న బియ్యానికి డిమాండ్ తగ్గడంతో క్వింటాల్ కొత్త బియ్యాన్ని రూ.5 వేల నుంచి రూ.6 వేల దాకా అమ్మారు. బీపీటీ సోనా రూ.5,400, ఆర్ఎన్ఆర్ రూ.5,400, హెచ్ఎంటీ రూ.5,600, జైశ్రీరాం రూ.5,500 దాకా విక్రయించారు. పాత బియ్యాన్ని రూ.5,800 నుంచి రూ.6,500 దాకా అమ్ముకున్నారు. గత నెలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్​లో కొత్త బియ్యం రకాన్ని బట్టి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నాయి. ఈ నెలలో క్వింటాల్​కు రూ.400 నుంచి రూ.600 వరకు ధరలు తగ్గుముఖం పట్టాయి.